19 నవంబర్ 2008

పుటుక్కు జర జర డుబుక్కు మే!!!

మా ఫ్రెండ్ గోవిందంది షేర్ బిజినెస్ లో అందెవేసిన చెయ్యి! వాడ్ని కదిలించడమే పాపం, తాజా మార్కెట్ పరిణామాలతో రెడీగా ఉంటాడు. మార్కెట్ వొడిదుడుకులకు తనదైన శైలిలో సమీకరణలు నిర్వచిస్తూ ఎలా మార్కెట్ లో నిలబడాలో చాలా వింతగా చెపుతాడు. అలాంటిది, మా వాడు, వో రెండు రోజులు బయటెక్కడా కనిపించలేదు. తర్వాత, వో రోజు బస్ స్టాప్ లో కలిసాడు. మొన్నటి దాకా ౧౮౦౦౦ క్యాండిల్స్ వెలుగుతో వున్నమొహం కాస్తా ౯౦౦౦ క్యాండిల్స్ కి వాడిపోయింది. వద్దు అనుకుంటూనే వాడ్ని కదిలించాను. నేటి మార్కెట్ పరిస్థితికి వాడు ఇచ్చిన కొత్త సమీకరణం 'పుటుక్కు జర జర డుబుక్కు మే' !...చాలా ఆసక్తిగా అనిపించి కొంచెం వివరించమన్నా! మా వాడు రెచ్చిపోయాడు...ఇలా... "అమెరికా చాలా అందమైన పూరి గుడిసె అని..దాని పై అల్లుకున్న అందమైన గుమ్మడి పాదు దాని ఆర్ధిక వ్యవస్థ అని...ఆ పూరి గుడిసె కింద...వో...ప్రక్కన...వో మేక (బుల్ కాదని మనవి)..అదే మన...షేర్ మార్కెట్ అని...ఎవడో రియల్ ఎస్టేట్ దొంగ.... గుమ్మడి కాయల్ని 'పుటుక్కు' మని (ఎవ్వరూ భుజాలు తడుముకో వద్దని మనవి) తుంచితే... అందులో వొకటి..జర..జర..మని దొర్లుతూ...డుబుక్కు మని మన మేక పై పడితే అది మే అని అరిచింది. ఏమిటని చుస్తే దాని కాలువిరిగి కుంటిడైంది...ఇది..నా సమీకరణం వెనకున్న కధ...అర్ధమైందా?..." చెప్పడం ఆపాడు. తేరుకోడానికి వో నాలుగు సెకండ్లు అయింది. "ఆ అర్ధ...మైంది...అంటూ...ఏదో...ఫోన్ వస్తున్నా వాడిలా నటిస్తూ...మళ్లీ కలుద్దాం" అని జారుకున్నా! ఏ మాటకి ఆ మాటే. మన వాడి సమీకరణం ఏదో అతికినట్లుగా అనిపిస్తోంది కదూ! అదే మన 'గోవిందం' గొప్పదనం!

1 కామెంట్‌:

Ratnakar చెప్పారు...

well said. I do now whether it is deliberate but the name of your friend "Govindam" suited the topic, because that is what we say when we lose money "Govindaa..govinda".
However as events of the past few days proved,the problem of cross-border terrorism is a far bigger crisis than the financial crisis. I will wait to see what "Govindam" has to say about this :-)